Tuesday, September 25, 2012

కోదండరామ్ :జానారెడ్డి ఆరాటం సిఎం పదవి కోసం



హైదరాబాద్ :పంచాయతీరాజ్ శాఖ మంత్రి కుందూరు జానా రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని, అందుకే ఆయన ఒక్కోసారి ఒక్కోరకంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆరోపించారు. తెలంగాణ మార్చ్‌కు సహకరించమని బిజెపి నేతలను కలిసి జెఏసి నేతలు కోరారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌ను విఫలం చేసే విధంగా ప్రభుత్వం భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
అరెస్టులకు, బ్యారీకేడ్లకు తెలంగాణ ప్రజలు భయపడరని, ఎట్టి పరిస్థితుల్లో మార్చ్ చేసి తీరుతామన్నారు. తెలంగాణ డిమాండ్ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ సాధన కోసమే మార్చ్ తలపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ ప్రకటించండి లేదా మార్చ్‌కు అనుమతించండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంత నేతలు ప్రజల వైపుకు ఉంటారో ఉండరో తేల్చుకోవాలని సూచించారు. జానా రెడ్డి బాధ్యత కలిగిన నేతగా వ్యవహరించాలని సూచించారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సీమాంధ్ర ప్రభుత్వమని, సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కాపాడేందుకే ఈ ప్రభుత్వం చూస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతల అహంకారానికి, పెత్తనానికి వ్యతిరేకంగా తాము మార్చ్ చేస్తున్నామన్నారు. మార్చ్‌ని శాంతియుతంగా నిర్వహిస్తామని, అందుకు ప్రభుత్వం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో తెలంగాణపై మంత్రులకు, నేతలకు లేఖ రాస్తామని చెప్పారు.
మార్చ్ శాంతియుతంగా సాగేందుకు అందరూ సహకరించాలన్నారు. సమ్మక్క సారక్క జాతరకు పోయినట్లు, మక్కాకు పోయినంత పవిత్రంగా, క్రీస్తు శాంతి ప్రవచనాల మాదిరి సాగుదామన్నారు. మా ప్రాంతాన్ని మేం పాలించుకోవడానికే ఈ పోరాటం అన్నారు. మార్చ్‌ను అడ్డుకునే ఉద్దేశ్యంలో భాగంగా తెలంగాణ నుండి హైదరాబాద్ వచ్చే అన్ని మార్గాలలో ప్రభుత్వం బ్యారీకేడ్లు ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 30లోగా ప్రధాని తెలంగాణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 3:41 AM Kategori:

0 comments:

Post a Comment