రాష్ట్ర రాజకీయాలపై ఏదో జరుగుతోంది..జరగబోతోంది అని ప్రచారం సాగుతున్నా...ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. నాయకత్వ మార్పు అంటూ ఊహాగానాలు కొనసాగుతున్నా...అవేమీ వుండవన్న ధీమాతో సీఎం దూసుకెళుతున్నారు. ఈక్రమంలోనే రేపటి నుంచి కృష్ణా జిల్లాలో ఏడో విడత ఇందిరమ్మ బాటకు సిద్ధమయ్యారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తితో వున్న అధిష్టానం...నాయకత్వ మార్పు దిశగా ఆలోచన చేస్తోందని గత కొంత కాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. కొంతమంది నేతలైతే ఏకంగా పలుమార్లు ముహుర్తాలు పెడుతున్నారు. ఢిల్లీలో అయితే ఏదో ఒక కసరత్తు జరగుతోందని...అయితే అది తెలంగాణా సమస్య పరిష్కారం దిశగా అని కొందరు.. లేదు నాయకత్వ మార్పు గురించి అని మరికొందరు ఇలా ఎవరికి తోచినట్లు వారు చెప్పుకొస్తున్నారు.. ఐతే..ఈ ప్రచారాలు, ఊహాగానాలు ఎలా వున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తన పదవికి ఏమీ ఢోకా లేదని.. 2014 వరకు తానే సీఎం అని ఘంటాపథంగా చెప్తున్నారు.
ఇప్పటికే పాలనపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న కిరణ్ ..ఆరుసార్లు ఇందిరమ్మ బాటను నిర్వహించారు. ఏడో విడత ఇందిరమ్మ బాటను కృష్ణాజిల్లాలో చేపడుతున్నారు. ఒకవైపు ఈ నెలాఖరులోపు ఏదో ఒకటి తేలుతుందని, ముఖ్యమంత్రికి ఢిల్లీ నుండి పిలుపు వస్తుందని ప్రచారం జరుగుతుంటే.. ఆయన మాత్రం 25నుంచి 27 వరకూ కృష్ణా జిల్లాలో ఇందిరమ్మ బాటను నిర్వహిస్తున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపైన కూడా ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే చిరంజీవి కూడా ఆయనను కలిసి తన వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. ఇక హైదరాబాద్‌లో జరగబోతున్న జీవవైవిధ్య సదస్సు సక్సెస్‌ఫుల్‌గా జరిగితే....కిరణ్ సమర్థత నిరూపణై ఆయనకు ఢిల్లీలో మరింత బలం చేకూరడం ఖాయం. దీనికి తగ్గట్టే కిరణ్ కూడా బయో సదస్సును విజయవంతం అయ్యేలా కృషి చూస్తున్నారు. ఎలాంటి లోపాలు, ఆటంకాలు కలగకుండా జరిగేలా అధికారులను ఆదేశించారు.

0 comments:
Post a Comment