Monday, September 24, 2012

రేగిడిమండలాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు



  • శ్రీకాకుళం జిల్లా రేగిడిమండలాన్ని కుదిపేస్తున్న భారీ వర్షాలు
  • మడ్డువలస రిజర్వాయర్‌  గేట్లు ఎత్తివేయడంతో వాగుకి గండి
  • గ్రామల్లోకి చేరిన వరదనీరు చేరడంతో ప్రజలకు ఇక్కట్లు
  • విద్యుత్‌ సరఫరా నిలిపి వేయడంతో గ్రామాల్లో అందకారం
  • నిత్యావసర సరుకులు నిండుకోవడంతో పస్తులుంటోన్న జనం
  • పంటలు నీటమునగడంతో కన్నీరు మున్నీరవుతోన్న అన్నదాతలు
శ్రీకాకుళం జిల్లాలో గత పదిరోజులుగా వరుసగా కురుస్తోన్న భారీ వర్షాలకు పలు గ్రామాల తో పాటు పంటపొలాలు ముంపుకుగురయ్యాయి.వర్షాల కారణంగా జలాశయాలకు పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీరువిడుదల చేస్తున్నారు.దీంతో.. లోతట్టు ప్రాంతాలు  సంద్రాల్లా మారాయి.

శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలంలోని మడ్డువలస  రిజర్వాయర్‌ సమీప గ్రామాలు వర్షాలకు తరచు ముంపుకు గురవుతున్నాయి.మడ్డువలస రిజర్వాయర్‌ నీటి మట్టం గణనీయంగా పెరుగుతుండడంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి ఆరువేల క్యూసెక్కుల నీటిని కాలువలకు వదిలారు.దీంతో.. రేగిడి మండలంలోని సాయన్న వాగుకి గండి పడింది.నీటి ఉధృతికి వాగు సమీపంలోని  రెండువేల ఎకరాల పంట నీటమునిగింది. మరోవైపు వరదనీరు పెద్ద ఎత్తున గ్రామాల్లోకి ప్రవేశించడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

రహదారులు సైతం జలమయం కావడంతో గత రెండు రోజులుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.నిత్యావసర వస్తువులు కొనుక్కునేందుకు వీలు కాక బాధిత గ్రామస్థులు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది.మరో వైపు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో అంధకారం నెలకొంది.తమ పంటపొలాలు పూర్తిగా నీటమునగడంతో నష్టాల పాలయ్యామని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.తమ గ్రామాలు ముంపుకు గురైనా పట్టించుకునే నాథుడే కరువ్యాడని బాధితులు వాపోతున్నారు.ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి ముంపుకు గురైన గ్రామాల్లో నీరు తొలగించాలని బాధిత ప్రజలు కోరుతున్నారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 8:17 AM Kategori:

0 comments:

Post a Comment