Monday, September 24, 2012

చంద్రబాబు నాయుడు 'మీ కోసం .. వస్తున్నా ' పాదయాత్ర అక్టోబర్ 2 నుంచి ప్రారంభం



మహాత్మాగాంధీ పుట్టిన రోజు కంటే మంచి రోజు లేదని, అందుకే రాష్ట్రంలో పాదయాత్రను అక్టోబర్ 2నుంచి ప్రారంభించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ఎన్టీరామారావు ప్రాతినిథ్యం వహించిన అనంతపురం జిల్లా, హిందూపురం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పాదయాత్రపై స్పందించారు. 'మీకోసం...వస్తున్నా'' అనే పాదయాత్ర పేరు ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ యాత్రకు "జనచైతన్య'', "వస్తున్నా ... మీకోసం'' పేర్లను పరిశీలించినట్లుగా చెప్పారు. అయితే సమావేశంలో నేతలతో సంప్రదించిన తర్వాత మీకోం... వస్తున్నా పేరునే అందరూ ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ పాదయాత్ర జనవరి 26 వరకు జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడైనా మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందని చంద్రబాబు నాయుడు అన్నారు. కాంగ్రెసు పార్టీతో ముప్పయ్యేళ్లుగా పోరాడున్న పార్టీ టిడిపియే అన్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని, అలాగే కే. చంద్రశేఖరరావు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వైఎస్. జగన్మోహన్‌రెడ్డి నెలకొల్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను కూడా కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు. కాంగ్రెసుతో ఇప్పటి వరకు రాజీపడనిది కేవలం టిడిపియేనని, ఎన్ని ఆటుపోటులు వచ్చినప్పటికీ తట్టుకొని నిలబడగలిగిందన్నారు. కొందరు తమ తప్పులను కప్పి పుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.

తెలంగాణపై కేంద్రం రోజుకో విధంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర విభజన అంశంపై ఇరు ప్రాంతాల నేతలతో చర్చిస్తున్నట్లు చెప్పారు. కేంద్రంలో ఇప్పటి వరకు వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వాలు అన్ని తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే అధికారంలోకి వచ్చాయన్నారు.

ads

Ditulis Oleh : GMRaju Hari: 5:38 AM Kategori:

0 comments:

Post a Comment